కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో వేమిరెడ్డి దంపతుల భేటీ……..

0
17

✍🏻పెన్నా కరకట్టల పటిష్టత, పల్లిపాడు గాంధి ఆశ్రమ రక్షణే లక్ష్యంగా హోం మంత్రి అమిత్ షా ను కలిసిన వేమిరెడ్డి దంపతులు- వేమిరెడ్డి దంపతులకు కేంద్రమంత్రి ఆప్యాయ పలకరింపు- ఎన్నోయేళ్లుగా శాశ్వత పరిష్కారానికి నోచుకోని కర కట్టల పరిస్థితిపై వినతులు- గాంధీ ఆశ్రమం నుండి పల్లిపాడు గ్రామం వరకు పెన్నా నది కుడి వైపున 167 కోట్లతో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం.

✍🏻విడవలూరు మండలం ముదివర్తి నుండి ఊటుకూరు వరకు 95 కోట్లతో పెన్నా ఎడమ వైపు కరకట్ట ఆధునీకరణ.- ఇందుకూరుపేట మండల పరిధిలోని పెన్నానది కుడి వైపు పొర్లు కట్టల బలోపేతానికి 69 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు.- NDRF ద్వారా పెన్నా నది కరకట్టల పటిష్టతకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూల స్పందన…

✍🏻నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమీత్ షా గారిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి.. వేమిరెడ్డి దంపతులను ఆప్యాయంగా పలకరించారు. పెన్నా నది కరకట్టల బలోపేతం మరియు చారిత్రక పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2021 నవంబర్ నెలలో సోమశిల జలాశయం నుండి వరద నీరు పెన్నా నదిలోనికి విడుదల చేయడంతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టలు తెగిపోయి , బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాలు పూర్తిగా జలమయమయమై జనజీవనం స్తంభించిపోయిన సంఘటనలను వేమిరెడ్డి దంపతులు హోం మంత్రి అమిత్ షాకు వివరించారు. వరద బీభత్సంలో పడుగుపాడు వద్ద జాతీయ రహదారి కోతకు గురై రాకపోకలు స్తంభించి జనజీవనం స్తంభించి పోయిన సంఘటనలను హోం మంత్రి అమిత్ షా దృష్టికి తెచ్చారు. ఇందుకూరు పేట మండలంలోని దక్షిణ భారత సబర్మతిగా పేరుగాంచిన చారిత్రక పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం సుమారు ఏడున్నర ఎకరాల మేర పెన్నానది కోతకు గురి కావడంతో గాంధీ ఆశ్రమం ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వేమిరెడ్డి దంపతుల యిచ్చిన సమాచారం పట్ల హోం మంత్రి అమిత్ షా గారు తీవ్రంగా స్పందించారు. ముదివర్తి పాలెం రాజు కాలనీ, విడవలూరు మండలం ముదివర్తి, ఊటుకూరు తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు నిత్యావసరాల కోసం తీవ్ర అవస్థలు, వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగి పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం, కోట్లాది రూపాయల విలువైన ఆక్వా చెరువులు వరద పాలై ఆక్వా రైతులు, మత్స్యకారులు వీధిన పడ్డ సంఘటనలను వేమిరెడ్డి దంపతులు హోం మంత్రికి తెలిపారు. అలాగే విద్యుత్ సౌకర్యాలు లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విపత్తుతో ఇళ్లు కూలిపోయి పశువులు వరదల్లో కొట్టుకుపోయిన దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా పెన్నా నది కరకట్టలను పట్టిష్టం చేయాలని వేమిరెడ్డి దంపతులు హోం మంత్రి అమిత్ షా గారిని కోరారు. ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గాంధీ ఆశ్రమం నుండి పల్లిపాడు గ్రామం వరకు పెన్నా నది కుడి వైపున 167 కోట్లతో భారీ రక్షణ గోడ నిర్మాణం, విడవలూరు మండలం ముదివర్తి నుండి ఊటుకూరు వరకు 95 కోట్లతో ఎడమ కరకట్ట ఆధునీకరణ, మరియు ఇందుకూరుపేట మండలంలో పొర్లు కట్టల బలోపేతం కోసం 69 కోట్లతో కూడిన ప్రతిపాదనలను వారు హోం మంత్రి అమిత్ షా గారికి సమర్పించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా వేమిరెడ్డి దంపతులు చేసిన విన్నపాల పట్ల హోం హోం మంత్రి అమిత్ షా గారు సానుకూలంగా స్పందించారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా పెన్నా కరకట్టల పటిష్టత మరియు చారిత్రక పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు ప్రయత్నిస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు వేమిరెడ్డి దంపతులకు చెప్పారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కర కట్టలతో ఇబ్బందులు పడుతున్న తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here