ఉప ముఖ్యమంత్రి చౌదరి మీడియాతో మాట్లాడుతూ, 2019లో జమ్మూకశ్మీర్ నుంచి ఊడలాక్కున్న ప్రత్యేక ప్రతిపత్తి గురించే తాము మాట్లాడుతున్నామని, బీజేపీకి నార్కో టెస్ట్ జరిపితే వాళ్లు కూడా ఇదే మాట అంటారని ఆ పార్టీపై మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో బయట నుంచి వచ్చిన వారు ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను (Article 370) పునరుద్ధరించేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపాలని కోరుతూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని బుధవారంనాడు ఆమోదించింది. విపక్ష బీజేపీ సభ్యుల తీవ్ర వ్యతిరేకత, సభలో గందరగోళం మధ్య ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి సురిందర్ కుమార్ చౌదరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి చౌదరి మీడియాతో మాట్లాడుతూ, 2019లో జమ్మూకశ్మీర్ నుంచి ఊడలాక్కున్న ప్రత్యేక ప్రతిపత్తి గురించే తాము మాట్లాడుతున్నామని, బీజేపీకి నార్కో టెస్ట్ జరిపితే వాళ్లు కూడా ఇదే మాట అంటారని ఆ పార్టీపై మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో బయట నుంచి వచ్చిన వారు ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. బయట నుంచి వచ్చిన వారు ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజల భవిష్యత్తును పరిరక్షించేందుకు తాము ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
”బీహార్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రామిస్ చేసింది. వాళ్లు రాముడి పేరు (అసెంబ్లీలో) తెచ్చారు. వాళ్లకు మేము చెప్పదలచుకున్నది ఒకటే. ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. జమ్మూకశ్మీర్‌కూ స్పెషల్ స్టాటస్ కావాలి. లెఫ్టినెంట్ గవర్నర్ హయాంంలో రాజౌరి, చినాబ్ వ్యాలీ, కథువా, సాంబలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టారా?” అని చౌదరి ప్రశ్నించారు.
తీర్మానం ఏం చెప్పింది?
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను తొలగించడం ఏకపక్షమని జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం పేర్కొంది. ”జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృత, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ పరమైన హామీలను ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది. దీని ప్రాధాన్యతను మరోసారి లెజిస్టేటివ్ అసెంబ్లీ బలంగా చాటుతోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక పత్రిపత్తి కల్పించే 370వ అధికరణను ఏకపక్షంగా తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది” అని ఈ తీర్మానం పేర్కొంది. కాగా, ఈ తీర్మానాన్ని బీజేపీ విపక్ష నేత సునీల్ శర్మ సహా ఆ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సునీల్ శర్మ అన్నారు. లెప్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై చర్చ అని తమకు చెప్పి సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టడటం ఏమిటని నిలదీశారు. తీర్మానానికి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మద్దతు పలికాయి. విపక్ష సభ్యులు మాట్లాడడానికి ముందుకు రాకపోతే ఓటింగ్‌కు పెడతానని స్పీకర్ అబ్దుల్ల రహీమ్ పేర్కొనడం, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మూజువాణి ఓటుకు స్పీకర్ ఆదేశించారు. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం 370వ అధికరణను రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగు విభజించింది.